డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో భానుడి భగభగలకు 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. సాధారణ జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూ జిల్లా అటవీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది యూనిఫామ్ వేసుకుని అడవిబాట పడుతున్నారు. అడవుల రక్షణతోపాటు వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు కాలినడకన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎండలో అడవుల్లో తిరుగుతూ విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో 86,871.45 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. అడవులను సంరక్షించేందుకు మొత్తం ఏడు రేంజ్‌లు ఉండగా, కమ్మర్‌పల్లి, సిరికొండ, ఇందల్వాయి, వర్ని రేంజ్‌లలో ఎక్కువగా అడవులు ఉన్నాయి. ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, నవీపేట్ మండలాల్లో గుట్టలు కూడా ఉన్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా సహజసిద్ధమైన వాగులు, వంకలు, చెరువులు ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటలు (సాసర్ పిట్స్), సోలార్ బోర్‌వెల్స్ ద్వారా నిరంతరం నింపుతున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్క చేయకుండా సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా గస్తీకాస్తున్నారు.
45 డిగ్రీల ఉష్ణోగ్రతను
లెక్కచేయకుండా పెట్రోలింగ్
జనం ఇళ్లు దాటని వేళ..
అటవీబాట పట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు
అడవులకు అంటిన కార్చిచ్చు
ఆర్పేందుకు సాహస చర్యలు
వన్యప్రాణుల దాహార్తి కోసం
భగీరథ ప్రయత్నం


