● గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ గాలం
● పది పాసైనోల్లు టార్గెట్
● నమ్మించి రూ.లక్షలు
దండుకుంటున్న వైనం
ఆర్మూర్ : కార్పొరేట్ కళాశాలల ఏజెంట్లు గ్రామాల బాటపట్టారు. ఫ్రీ సీటు, హాస్టల్, ఫీజులో రాయితీ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నా రు. మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రయివేటు కళాశాలలతోపాటు హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల ఏజెంట్లు స్థానికంగా అద్దె గదుల్లో నివాసముంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వల విసురుతున్నారు. మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు టెలీకాలర్లను నియమించుకొని తల్లిదండ్రులకు రోజుకు పదుల సంఖ్యలో ఫోన్లు చేయిస్తూ మభ్యపెడుతున్నాయి.
బాండ్‌పై సంతకాలు..
పదో తరగతి ఫలితాలు రాగానే కార్పొరేట్ కాలేజీల ఏజెంట్లు మార్కుల జాబితాలతో గ్రామాల్లో వాలా రు. 500లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థు ల ఇళ్లకు వెళ్లి మీ అబ్బాయి చాలా తెలివైనో డు, మా కాలేజీలో ఫ్రీ సీటు.. ఫీజులో రాయితీ అంటూ నమ్మబలుకుతున్నారు. గిఫ్ట్‌లు ఇచ్చి తల్లిదండ్రుల ను ఆకర్షిస్తున్నారు. కొందరు ఏజెంట్లు అయితే అడ్వాన్స్‌గా రూ.10 వేలు చేతిలో పెట్టి సదరు విద్యార్థి పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని సీటు కన్‌ఫర్మ్ అని బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుంటున్నారు.
అడ్మిషన్ తీసుకుంటే అంతే..
ఒకసారి అడ్మిషన్ తీసుకున్నాక అసలు కథ మొదలవుతోంది. ట్యూషన్ ఫీజు ఫ్రీ, కానీ బిల్డింగ్ ఫండ్, స్పెషల్ కోచింగ్, మెటీరియల్, యూనిఫాం పేరు తో ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన నారాయణ తన కొడుకును ఫ్రీ అని నమ్మి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పిస్తే ఇప్పుడు రూ.1.10 లక్ష కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
నిబంధనలు గాలికి..
ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం అడ్మిషన్ల సమయంలో అదనపు ఫీజులు వసూలు చేయడం నేరం. కానీ కార్పొరేట్ కాలేజీలు యాజమాన్య కోటా పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి.
గ్రామీణ విద్యార్థులు, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రూ. లక్షలు దండుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
తల్లిదండ్రులు ఏం చేయాలి..
ఏ కాలేజీ ఏజెంట్‌కూ అడ్వాన్స్‌గా ఫీజు డబ్బులు, పదో తరగతి సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. ఫ్రీ అని చెబితే రాతపూర్వకంగా తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని గుర్తించాలి. అక్రమ వసూళ్లపై టోల్ ఫ్రీ నంబర్ 1800–425–3533కు ఫిర్యాదు చేయాలి.
ముందస్తుగా డబ్బులు కట్టొద్దు
కార్పొరేట్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. గ్రామాల్లో ఏజెంట్లతో అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. తల్లిదండ్రులు ముందస్తుగా ఎవరికీ డబ్బులు కట్టొద్దు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– రవికుమార్, డీఐఈవో


