డీఎంహెచ్‌వో రాజశ్రీ
గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్
సుభాష్‌నగర్: క్షయ రహిత సమాజమే అందరి లక్ష్యమని, వ్యాధి నిర్ధారణ పరీక్షలను పెంచి సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవాలని డీఎంహెచ్‌వో రాజ శ్రీ సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో క్షయ నియంత్రణ విభాగం పనితీరు, లక్ష్యాల సాధనపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్మూర్, బోధన్ ప్రాంతాల్లో పెండింగ్‌లో చాలా కేసులు ఉన్నాయని, వాటన్నింటిని నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తూ నూతన కేసులను గుర్తించాలన్నారు. క్షయ రహిత గ్రామాల సంఖ్యను పెంచాలన్నారు. సర్పంచుల సహకారంతో లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. నిజామాబాద్ పట్టణంలో డివిజన్ల వారీగా క్షయ నిర్ధారణ శిబిరాలను నిర్వహించి, నూతన కేసులను గుర్తించడానికి ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్ ఏజీ, వైడల్, హెచ్‌బీ, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరీ, డీహెచ్‌ఈ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు, డీపీసీ లక్ష్మణ్, నరేశ్, రవిగౌడ్, వినోద్ సిబ్బంది పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: పద్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ రక్షణగా నిలుస్తుందని డీఎంహెచ్‌వో రాజ శ్రీ తెలిపారు. నగరంలోని మాలపల్లి, అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కార్పొరేటర్లు, మత పెద్దలతో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై గురువారం చర్చించారు. ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు. మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ఇస్తున్నామని తెలిపారు. డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ మాట్లాడుతూ మైనార్టీ ఏరియాలోని ప్రతి బాలికకు హెచ్‌పీవీ టీకాను ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, డాక్టర్ అజ్మల్, డాక్టర్ అజ్మతున్నీసా బేగం, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సికందర్ నాయక్, రాణా ప్రతాప్, నవ్య, కార్పొరేటర్లు షకీల్, ఇంతియాజ్, రియాజ్, అమన్ ఫారూఖీ, ఆదిత్య, ముజీబ్, ఆజాద్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


