త్వరలో పంపిణీ చేస్తాం...
● 50 శాతం సబ్సిడీపై
సొసైటీల ద్వారా త్వరలో పంపిణీ
● వ్యవసాయశాఖకు అందిన ఉత్తర్వులు
డొంకేశ్వర్(ఆర్మూర్) : వానకాలం సాగు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ జిల్లాకు అవసరమైన జీలుగ, జనుము విత్తనాలను తెప్పిస్తోంది. 10 వేల క్వింటాళ్లకుగాను ప్రస్తుతం 1310 క్వింటాళ్లు జిల్లాకు చేరుకున్నాయి. మిగతావి కూడా విడతల వారీగా తెప్పించే పనిలో ఉన్నారు. పంటలకు అధిక దిగుబడులనిచ్చే పచ్చి రొట్ట విత్తనాలను సొసైటీల ద్వారా 50శాతం సబ్సిడీపై రైతులకు త్వరలో పంపిణీ చేయనున్నారు. ఇందుకు రైతు ఆధార్, పట్టా పాస్‌పుస్తకం చూపాల్సి ఉంటుంది. 30 కిలోలు ఉండే ఒక జీలుగ బస్తా ధర రూ.4,904 ఉండగా, సబ్సిడీ పోను రైతులు రూ.2,452 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే 44 కిలోల జనుము బస్తా ధర రూ.6,220 కాగా, రైతులు రూ.3,100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు దీని సంబంధిత ఉత్తర్వులు వ్యవసాయ శాఖకు అందాయి.
లాభాలివే..
● జీలుగను కలియదున్నడం వలన ఎకరానికి సుమారు 8 నుంచి 10 టన్నుల సేంద్రియ పచ్చిరొట్ట లభిస్తుంది. ఇది మట్టిని సారవంతం చేసి మేలు చేస్తుంది.
● చౌడు, లవణ గుణాలు ఎక్కువగా ఉన్న నేలలకు జీలుగ అత్యంత అనుకూలమైంది. ఇది నేల పీహెచ్ స్థాయిని తగ్గించి, చౌడును విరిచేందుకు సహాయపడుతుంది.
● నేల గుల్లబారి గాలి ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా భూమికి నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్ధ్యం బాగా పెరుగుతుంది.
● జీలుగ మొక్కలు వేగంగా పెరిగి పొలమంతా దట్టంగా అల్లుకుపోవడం వల్ల కలుపు మొక్కలు పెరగడానికి అవకాశం ఉండదు. వరి పంట దిగుబడి 20శాతం వరకు పెరుగుతుంది.
ఎకరానికి 12 నుంచి 15 కిలోల జీలుగ విత్తనా లు అవసరమవుతా యి. విత్తనాలు విత్తిన 40 నుంచి 45 రోజుల వ్యవధిలో పూత దశకు రాగానే నీరు పెట్టి పొలంలోనే కలియదున్నాలి. ఆ తర్వాత పది రోజులు కుళ్లనిచ్చి తదుపరి పంటను వేయాలి. త్వరలోనే సొసైటీల ద్వారా వి త్తనాలను సబ్సిడీపై అందజేస్తాం.
– మధుసూదన్,
మండల వ్యవసాయాధికారి, డొంకేశ్వర్


