నల్లమట్టి.. చేనుకు పుష్టి | - | Sakshi
Sakshi News home page

నల్లమట్టి.. చేనుకు పుష్టి

May 2 2026 11:31 AM | Updated on May 2 2026 11:31 AM

50 ట్రిప్పులు పోశాం.. దిగుబడి పెరిగింది..

భూసారం పెరుగుతుంది

పొలంలో పోసుకుంటే భూసారం పెరుగుతుందంటున్న అధికారులు

తద్వారా పంట దిగుబడి

పెరిగే అవకాశం

నందిపేట్‌ (ఆర్మూర్‌): వచ్చే నెలలో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదాతలు పంట చేలను సారవంతం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏటా మూడు పంటలు పండిస్తుండటంతో నేల తనలోని సారం కోల్పోతుంది. భూసారం కోల్పోతే పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పంటల రోగ నిరోధక శక్తి తగ్గడంతో చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లోని చెరువులు, కుంటలలో నీళ్లు అడుగంటడంతో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు చేపడుతున్నారు. తద్వారా చెరువులు, కుంటల్లో నీటినిల్వలు పెరడంతోపాటు చెరువు (నల్ల) మట్టిని వ్యవసాయ భూములకు తరలించవచ్చు. పూడిక తీసిన చెరువు మట్టిని భూమిలో పోసుకుంటే భూసారం పెరుగుతుందని వ్యవసాయాధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతులు కొంత చెల్లించి చెరువులతో పాటు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి నల్లమట్టిని ట్రాక్టర్ల ద్వారా తమ చేన్లలో పోసి తరలించుకుంటున్నారు.

లాభాలు ఇవే..

● చెరువు మట్టిలో ఒండ్రు, బంక మట్టితోపాటు పంటలకు అవసరమయ్యే నత్రజని, భాస్వరం, పోటాష్‌తో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి.

● చేనులో చెరువు మట్టిని పోసుకొని చేనంతా చల్లుకోవడం ద్వారా నేలకు అన్ని పోషకాలు అందుతాయి. దీంతో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

● నల్లమట్టిలో సేంద్రియ కర్బనం, సూక్ష్మ పోషక మూలకాలు అధికంగా ఉంటాయి. దీంతో మొక్కలు రోగనిరోధక శక్తిని కల్గి ఉంటాయి.

● రసాయన ఎరువులకు బదులు నల్లమట్టిని వినియోగించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి.

వ్యవసాయాధికారుల సూచనలతో ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లోంచి తీస్తున్న నల్లమట్టిని చేన్లలో పోసుకుంటున్నాం. పెట్టుబడులు తగ్గుతున్నాయి. నామమాత్రంగా చెల్లించి 50 ట్రాక్టర్‌ ట్రిప్పుల మట్టిని పోశాం. –కార్తీక్‌ రెడ్డి, వన్నెల్‌ కే గ్రామం

గత వానాకాలం పంట వేయడానికి ముందు చెరువులోని నల్లమట్టిని చేనులో పోయించాం. దీంతో రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. దీంతో ఈసారి కూడా మట్టిని చేనులో పోయిస్తున్నాం.

–గోపుముత్యం,

బజార్‌ కొత్తూరు గ్రామం

చెరువుల్లో పూడిక తీయగా వచ్చిన నల్లమట్టిని పంటచేలకు తరలిస్తే భూసారం పెరుగుతుంది. ఇసుక, దుబ్బనేలల్లో నల్ల మట్టి పోస్తే నీటిని నిల్వ చేసే సామర్థ్యంతోపాటు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. అన్నదాతలందరూ తమ పొలాల్లో చెరువు మట్టిని తప్పకుండా పోసుకోవాలి.

–రాంబాబు, ఇన్‌చార్జి ఏవో, నందిపేట్‌ మండలం

Advertisement
 
Advertisement
Advertisement