● మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ రూరల్: యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఆదివారం రూరల్ పోలీసులు నిర్వహించిన 2కే రన్‌ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతే దేశానికి భవిష్యత్తు అని అన్నారు. సామర్థ్యాన్ని సరైన దారిలో వినియోగిస్తే యువత మాత్రమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇటీవల యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మంచి మాటలు వినాలని, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని అన్నారు. అనంతరం 2కే రన్‌లో ప్రతిభ కనబర్చిన వారికి సీపీ సాయిచైతన్య బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వా రెడ్డి, ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఎండీ షరీఫ్ , ఆనంద్ సాగర్, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


