ప్రజల కోసమే కొత్త పార్టీ | - | Sakshi
Sakshi News home page

ప్రజల కోసమే కొత్త పార్టీ

Mar 28 2026 7:19 AM | Updated on Mar 28 2026 7:19 AM

ఆవిర్భావ సభకు తరలిరండి

అన్నివర్గాలకూ ఆహ్వానం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజల కోసం పనిచేసేందుకే కొత్త పార్టీ పెడుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 25న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు సబ్బండవర్ణాలు తరలిరావాలని ఆమె ఆహ్వానించారు. నగరంలోని జాగృతి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా సాధించుకోలేకపోవటం బాధాకరమన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, ఆ తర్వాత రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో కూడా మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యే వరకు ఒకలా, అయిన తర్వాత మరోలా ప్రవర్తించటం రాజకీయ ఒరవడిగా మారిందని విమర్శించారు. ఇచ్చిన మాట అమలు చేయకపోయినా సరే ప్రజలు పట్టించుకోరన్న ధైర్యం రాజకీయ నాయకుల్లో ఉందన్నారు. ఆ విధానం పోవాలంటే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, కార్మికులు తదితర అన్నివర్గాల కోసం జాగృతి గత 20 సంవత్సరాలుగా పనిచేసిందని కవిత గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 350 మంది రైతులకు జాగృతి సంస్థ తరఫున నాలుగేళ్లపాటు నెలకు రూ. 2500 పెన్షన్‌ ఇచ్చామని వెల్లడించారు. నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాద్‌–పెద్దపల్లి రైల్వే లైన్‌ను మూడేళ్లలో పూర్తి చేయించానని పేర్కొన్నారు. నిజామాబాద్‌ వేదికగా పుట్టిన ఏ ఆలోచన అయినా సక్సెస్‌ అయ్యిందని, పార్టీ ఆలోచన కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోడలిగా తనకు ఇందూరు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. తెలంగాణ సోయి లేకపోవటంతోనే బీఆర్‌ఎస్‌ ఆదరణ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎనుగందుల మురళి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement