తెయూ(డిచ్‌పల్లి): సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి సూచించారు. పత్రికా స మాచార కార్యాలయం(పీబీఐ) హైదరాబాద్ ఆధ్వర్యంలో తెయూలో బుధవారం ‘సైబర్ హైజీన్ ప్రాక్టీ సెస్’ పై నిర్వహించిన వర్క్‌షాప్‌నకు రిజిస్ట్రార్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు, మీడియా ప్రతినిధుల్లో సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలు సైబర్ నేరాల నివారణలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని తెలిపారు. పీఐబీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ఈ వర్క్‌షాప్ విద్యార్థులు, మీడియాను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన తొలి హైబ్రిడ్ కార్యక్రమమన్నారు. సైబర్ హైజీన్ అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, నెట్‌వర్క్‌లను బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో ఉపయోగించడమని వివరించారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిత్యం జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో గతేడాది సుమారు రూ.1,600 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 2024లో రూ.16 లక్షలు, 2025 లో రూ.19 లక్షలు మోసం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంబాబు, అధ్యాపకులు ఎన్ స్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ జీ కోటేశ్వరరావు, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


