● యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో
మరింత బలపడుతున్న డిమాండ్
● భారత ప్రభుత్వం ఆ దిశగా
ముందుకెళ్లాలంటున్న వలస కార్మికులు
● గల్ఫ్‌లో భద్రతపై సాగుతున్న చర్చ
ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయలేదు
నేను 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చాను. గత ఆదివారం మా కజిన్ అక్కడి నుంచి వచ్చాడు. యుద్ధం నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయలేదు. రెగ్యులర్‌గా వచ్చే విమానాల్లోనే సొంత ఖర్చులతో తిరిగి వస్తున్నారు. అమెరికా దుందుడుకు వైఖరి కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.
– సుతారి సత్యం,
గల్ఫ్ రిటర్నీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్‌లు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 15 లక్షల మందికి పైగా కార్మికులు గల్ఫ్, ఇజ్రాయిల్ దేశాలకు వలస వెళ్లారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి 3 లక్షల మంది వరకు ఆయా దేశాల్లో పనిచేస్తున్నారు. వసల కార్మికుల వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా యుద్ధం నెలకొనడంతో గల్ఫ్‌లో భద్రత విషయమై మరోసారి చర్చ జరుగుతోంది. యుద్ధానికి ఐదు రోజులు విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ పూర్తిగా అనుమానాలు తొలగిపోలేదు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో తాజాగా సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. యుద్ధం కారణంగా ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉందని, భారత్‌కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని మోదీ అన్నారు. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారని, వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. భారతీయుల కోసం హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 3.75 లక్షల మందిని సురక్షితంగా భారత్‌కు తరలించినట్లు ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా ఇరానన్ నుంచి వెయ్యి మందిని తరలించామన్నారు. ప్రతిరోజూ పశ్చిమాసియాలోని దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నానని మోదీ పేర్కొన్నారు. యుద్ధం ఆపేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే గల్ఫ్‌లో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీ సక్రమంగా స్పందించడంలేదని పలువురు అంటున్నారు. టోల్‌ఫ్రీ నంబర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం అయిందని పలువురు గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


