రికార్డ్ స్థాయికి
● కిలో ధర రూ.400కు చేరువలో..
● సామాన్యుడు కొనలేని పరిస్థితి
డొంకేశ్వర్(ఆర్మూర్): చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడంతో మాంసాహార ప్రియులు కొనలేకపోతున్నారు. మొన్నటి వరకు కిలో చికెన్ రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.390వరకు పెరిగి రూ.400కు చేరువలో ఉంది. బాయిలర్ లైవ్ కోడి రూ.220 వరకు ఉంది. గడిచిన పదేళ్లలో ఇదే రికార్డు స్థాయి ధర కాగా.. సామాన్యులు కొనేందుకు రాకపోవడంతో చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. వేసవి తాపం పెరగడంతో ఫారాల్లో కోళ్ల మరణాల రేటు పెరిగిందని, మార్కెట్‌కు సరఫరా గణనీయంగా తగ్గినట్లు చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు సరిగ్గా మేత తినక ఆశించిన స్థాయిలో బరువు పెరగడం లేదని, సాధారణంగా 2.5కేజీలు ఉండాల్సిన కోడి ప్రస్తుతం 1.5కేజీల వరకే ఉంటోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అలాగే రంజాన్ మాసం కావడంతో చికెన్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఇటు మటన్ ధరలు కూడా కిలో రూ.800 నుంచి రూ.1,000 ఉండగా... చికెన్ ధర కిలో రూ.400 వరకు చేరువ కావడంతో సామాన్యులు, మాంసాహార ప్రియులు ఆదివారం వస్తే చాలు కొనేందుకు జంకుతున్నారు. కోడి గుడ్ల ధరలు (ఒక్కటి రూ.5) మాత్రం అందుబాటులో ఉన్నాయి.
ఇంతటి ధర ఎప్పుడూ చూడలేదు
చికెన్ ధరలు ఇంతలా పెరగడం నేను ఎప్పుడూ చూడలేదు. కిలో రూ.200 ఉంటేనే సామాన్యులు ఆలోచించి కొన్నారు. ఇప్పుడు కిలో రూ.400 వరకు చేరడంతో అసలు కొనడం లేదు. దీంతో చికెన్ సెంటర్లకు గిరాకీ తగ్గింది. ఇప్పట్లో చికెన్ ధరలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
– సుంకరి నాగరాజు, చికెన్ సెంటర్ నిర్వాహకుడు, డొంకేశ్వర్


