నూతన ఆవిష్కరణలకు మేధోసంపత్తి హక్కులు
తెయూ(డిచ్‌పల్లి): యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసి వాటికి మేథోసంపత్తి హక్కులు పొందినప్పుడే తమ ఆవిష్కరణలకు రక్షణ లభిస్తుందని సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ గుర్రపు రాజు పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ ఐపీఆర్ సెల్ ఆధ్వర్యంలో ‘మేధోసంపత్తి హక్కులు(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్–ఐపీఆర్)’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. మేథోసంపత్తి (ఐపీఆర్) అనేవి ఆవిష్కరణలు, సాహిత్య, కళాత్మక రచనలు, డిజైన్‌లు, చిహ్నాలు వంటి వాటికి చట్టపరమైన రక్షణ కల్పిస్తాయన్నారు. పరిశోధన, అభివృద్ధిని పెంపొందించేందుకు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారన్నారు. నూతన ఆవిష్కరణల వల్ల ఆర్థిక వృద్ధి, స్టార్టప్‌లకు పోటీతత్వం పెరుగుతుందని, వినియోగదారులకు రక్షణ లభిస్తుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. పరిశోధకులు, విద్యార్థులు తమ ఆవిష్కరణలను రక్షించుకోవడానికి మేధోసంపత్తి హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపాల్ కే ప్రసన్న రాణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, వర్సిటీ ఐపీఆర్ సెల్ నోడల్ ఆఫీసర్ వాసం చంద్రశేఖర్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ ఎం సత్యనారాయణ, వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


