ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫుట్‌బాల్ మ్యాచ్
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెస్సి హైదరాబాద్‌కు వచ్చి ఫుట్‌బాల్ ఆడినందుకు రూ.వందల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం విచారణ చేపట్టేలా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎమిరేట్స్ టీ షర్టు ధరించి ఆ సంస్థను ప్రమోట్ చేయడం అన్యాయమని అన్నారు. ఆయన కమీషన్‌ల వాటా ఎంత అని ప్రశ్నించారు. ఇది హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదని కోట్లు కొల్లగొట్టే పేమెంట్ కార్యక్రమమని విమర్శించారు. మెస్సి ఫుట్‌బాల్ ఆటగాడు అయితే.. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటులో కేటుగాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బ్రేక్ వేశారన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్, ప్రభాకర్, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ మ్యాచ్‌కు
రూ.వందల కోట్లా..?
హైదరాబాద్ ప్రతిష్ట పెంచే మ్యాచ్ కాదు..
కోట్లు కొల్లగొట్టే పేమెంట్ కార్యక్రమం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
జీవన్‌రెడ్డి విమర్శలు


