పశుగణన లెక్కలేవి..?
● ఏడాది క్రితం జిల్లాలో పూర్తయిన సర్వే
● ఇప్పటి వరకు వివరాలు వెల్లడించని
కేంద్ర ప్రభుత్వం
● సమాచారం లేదంటున్న పశుసంవర్ధక శాఖ అధికారులు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఏడాది క్రితం చేపట్టిన 21వ అఖిల భారత పశు గణన వివరాలు ఇంకా బయటకు రాలేదు. సర్వే లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలో ఏ జాతి పశువులు ఎన్ని ఉన్నాయనే కొత్త సమాచారం పశుసంవర్ధక శాఖ వద్ద లేకుండా పోయింది. దీంతో అధికారులు పాత (2018–19 సర్వే) లెక్కలే చెప్పాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి దేశమంతటా పశుగణన నిర్వహిస్తోంది. 21వ సర్వేను 2024 నవంబర్‌లో ప్రారంభించగా 2025 ఏప్రిల్‌లో ముగిసింది. పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆరు నెలలు శ్రమించి ‘పశుధన్’ యాప్ ద్వారా మొత్తం 16 జంతు జాతుల వివరాలను సేకరించారు. 31 మండలాల్లోని 545 గ్రామ పంచాయతీలతోపాటు పట్టణాల్లో కూడా పశుగణన చేశారు. సుమారు 4లక్షల నివాస గృహాలకు వెళ్లారు. అయితే యాప్‌లో నమోదు చేసిన వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లోకి వెళ్లిపోయాయి. సర్వే పూర్తయిన మూడు నెలల్లోనే వివరాలను విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. అంతకు ముందు (2018–19)లో జరిగిన పశుగణనలో కూడా కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల తర్వాత (2022లో) లెక్కలను విడుదల చేసింది. ఇప్పుడు కూడా అంతే జరుగుతుందనే భావనలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులున్నారు.
కేంద్రమే వెల్లడిస్తుంది
ఏడాది క్రితం జిల్లాలో చేపట్టిన పశుగణన సర్వే వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం సర్వర్‌లోకి వెళ్లిపోయాయి. అయి తే దేశమంతటా ఒకేసారి మొత్తం 16 రకాల పశు జా తుల లెక్కలను విడుదల చేస్తుంది. అందుకు మరో నాలుగైదు నెలల సమయం పట్టొచ్చు. అప్పుడే జిల్లాలో ఏ పశువులు ఎన్ని ఉన్నాయనే లెక్కలు పక్కాగా చెప్పడానికి వీలుంటుంది.
– రోహిత్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
పశుగణన లెక్కలేవి..?


