ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి
● ఐదుగురికి గాయాలు
నిజాంసాగర్: ఆటో బోల్తా పడిన ఘటనలో పదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ మండలం విఠల్‌వాడి తండా, సావర్‌గావ్ గ్రామ విద్యార్థులు ఖండెబల్లూర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజులానే బుధవారం ఉదయం 15 మంది విద్యార్థులు ఆటోలో పాఠశాలకు బయలు దేరారు. సావర్‌గావ్ శివారులో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సావర్‌గావ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి కాంబ్లే ప్రణవ్ (17) అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ వినోద్ అతివేగంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఆటో బోల్తాపడిందని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్నామని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు డీఈవో రాజుతోపాటు వైద్యులు, పోలీసులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, వారిని ఓదార్చారు.


