పోటాపోటీ.. రూ.కోటిపైనే ఖర్చు
రెంజల్(బోధన్): సర్పంచ్ ఎన్నికలను కొందరు అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నువ్వా నేనా అన్నట్లు తీవ్ర పోటీ ఉన్న గ్రామాల్లో అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటంలేదు. వ్యవసాయభూములు, ప్లాట్లు, బంగారం తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. ఎలాగైన గెలిచి తీరాలనే కసితో పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు కరువైంది. మొదటి విడత ఎన్నికలు జరుగనున్న బోధన్ డివిజన్‌లో ఇప్పటికే కుల సంఘాలను మచ్చిక చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. 1,500 నుంచి 2,000 వేల మంది ఓటర్లు ఉన్న గ్రామాల్లో ద్విముఖ, త్రిముఖ పోటీ ఉంది. ముగ్గురు పోటీ పడుతున్న మేజర్ గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో ఖర్చు రూ.కోటి దాటుతున్నట్లు సమాచారం. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో త్రిముఖ పోటీ, సాటాపూర్‌లో ద్విము ఖ పోటీ ఉండగా.. కళ్యాపూర్, నీలా, కందకుర్తి, తాడ్‌బిలోలి గ్రామాల్లో త్రిముఖ పోటీ ఉంది.


