గడ్డపార గ్యాంగ్ అరెస్ట్
పగలు రెక్కీ.. రాత్రి చోరీ..
● 11 తులాల బంగారం, బైక్ స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న గడ్డపార గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావవేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన మాసుల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన తాళం వేసిన ఇంట్లో ఈనెల 1 న రాత్రి చోరీ జరిగింది. గడ్డపారతో ఇంటి తాళం, బీరువాలను పగులగొట్టి చోరీ చేశారు. ఇదే తరహాలో జిల్లాలో తరచుగా కేసులు నమోదవుతుండడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం తాడ్వాయి సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఐదుగురు వ్యక్తులు కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల విషయం బయటపడింది. నిందితులను గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన బస్సీ జోద్‌రాజ్, అంకుష్ ప్రేమ్‌సింగ్ సాబలే, చెన్నాపూర్ తండాకు చెందిన బామన్ మహేందర్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాకు చెందిన బి.హీరాలాల్, నునావత్ గణేష్‌లుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారు, 22 తులాల వెండి ఆభరణాలు, రూ.8,500 నగదు, ఒక బైక్, 5 సెల్‌ఫోన్‌లు, చోరీలకు ఉపయోగించిన గడ్డపారలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు నరేష్, ఆంజనేయులు, సిబ్బంది సాయిబాబా, రవి, సంజీవ్, వసంత్ రావులను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులను అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు పట్టుకున్న వారిలో అంకుష్ ప్రేమ్‌సింగ్ సాబలే అనే నిందితుడు మహారాష్ట్ర నుంచి చాలా ఏళ్ల క్రితం కుటుంబంతో సహా గుర్జాల్ తండాకు వచ్చి స్థిరపడ్డాడు. ముఠాలోని ప్రధాన నిందితులైన బస్సీ జోద్‌రాజ్, అంకుష్ ప్రేమ్‌సింగ్ సాబలేలు పగటి వేళ కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. ఇళ్లను ఎంచుకుని రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడతారు. చోరీలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గడ్డపార వెంట తీసుకుని వెళ్తారు. దాంతోనే తాళాలు పగులగొడతారు. వారు చోరీ చేసుకుని వచ్చిన సొత్తును ముఠాలోని మిగతా నిందితులు ఇతర ప్రాంతాలకు తరలించడం, విక్రయించడం చేస్తుంటారు. ఇలా ఈ ముఠా జిల్లా లోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట్, రాజంపేట్, బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 9 చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
గడ్డపార గ్యాంగ్ అరెస్ట్
గడ్డపార గ్యాంగ్ అరెస్ట్


