ఎన్నికల్లో స్టేజ్–2 ఆర్వోల విధులు కీలకం
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకం. ఈ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు నుంచి ఓటింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి, ఉపసర్పంచ్ ఎన్నిక వరకు నిబంధనల మేరకు ఆర్వోలు చాలా ముఖ్యమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు స్టేజ్–2 ఆర్వోను నియమించారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు పోలింగ్ కేంద్రాల తనిఖీ, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాల తనిఖీ, నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయడం, ఓటరు స్లిప్‌ల పంపిణీ, పోలింగ్ సామగ్రి స్వీకరించి పీవోలకు అందించాలి. పోలింగ్ సరళిని పర్యవేక్షణతో పాటు పై అధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. ఓట్ల లెక్కింపు, కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఆర్వోల పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఎన్నికల ధ్రువీకరణ పత్రం ఆర్వోలే అందించాలి.


