అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారంటే ?
బోధన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను తెలుగు బాషలో రిటర్నింగ్ ఆఫీసర్ తయారు చేస్తారు. ఈ జాబితాలో అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షర క్రమంలో ఉండి, నామినేషన్ పత్రంలో పేర్కొన్న విధంగా పేర్ల అమరిక ఉంటుంది. అభ్యర్థి పేరులోని తొలి అక్షరం ఆధారంగా పేర్ల క్రమం నిర్ణయిస్తారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల గుర్తుల జాబితాలోంచి వరుస క్రమంలో అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌కు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తారు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు నిబంధనల ప్రకారం ఓ క్రమంలో అమర్చుతారు. బ్యాలెట్ పేపర్‌లో పోటీ చేస్తున్న చివరి అభ్యర్థి గుర్తు క్రింది భాగంలో నోటా ఆప్షన్ సూచించే గుర్తు ఉండేలా బ్యాలెట్ పేపర్‌ను ముద్రిస్తారు. అభ్యర్థులు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఒకే పేరు, ఇంటి పేర్లు వేర్వేరుగా ఉన్నట్లయితే, ఇంటి పేర్లను సూచిస్తూ అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓకే పేరు, ఒకే ఇంటి పేరు ఉన్నట్లయితే, వారి వృత్తి, నివాసం, చిరునామాల ప్రాతిపదికన జాబితాలో చేర్చాలి. అభ్యర్థి ఏదైనా గౌరవప్రదం, విద్యాపరం, వారసత్వ, వృత్తిపరమైన లేదా ఏదైనా ఇతర బిరుదులను జత చేయడానికి ఎటు వంటి ఆక్షేపణ ఉండదు. అయితే అక్షర క్రమంలో పేర్లు అమర్చు జాబితాలో అట్టిబిరుదును ఎట్టి పరిస్థితిలో పరిగణలోకి తీసుకొనకూడదు. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులను ఎన్నికల సంఘం 30 గుర్తులను ప్రకటించింది. ఇందులో ఉంగరం, కత్తెర, బ్యాట్, చెత్తడబ్బా, నల్లబోర్డు ఇలా ఉన్నాయి. వార్డు సభ్యులకు 20 గుర్తులు గౌను, గ్యాస్‌పొయ్యి, బీరువా, విజిల్ వంటివి ఉన్నాయి.


