బేఖాతరే..!
ఈసీ
అన్నా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని పలు చోట్ల గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు ఎన్నికల కమిషన్ (ఈసీ)ను లెక్కపెట్టకుండా గ్రామాల్లో సొంత రాజ్యాంగం నడిపిస్తున్నాయి. వీడీసీ సభ్యులు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు తమకు నచ్చిన విధంగా వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వేలం పాటలకు విరుద్ధంగా ఎవరైనా గ్రామస్తులు నామినేషన్లు వేసేందుకు వస్తే బెదిరింపులకు దిగుతున్నారు. వీడీసీని కాదని నామినేషన్ వేయడానికి వీలు లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో వివిధ గ్రామాలకు చెందినవారు జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన ఇలాంటి వ్యవహారాలను కలెక్టర్, పోలీసు కమిషనర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిగణించి ఆశావహులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేందుకు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని వీడీసీలు తమదైన శైలిలో గ్రామస్తులను బెదిరించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన పలువురు గురువారం జిల్లా కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు వేలంపాట వేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవిని రూ.32,80,000 లకు వేలం వేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఇప్పటికే రూ.5 లక్షలు వీడీసీకి ముట్టినట్లు తెలిపారు. ఇక ఉప సర్పంచ్ పదవిని రూ.7 లక్షలకు వేలం వేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. తమను నామినేషన్లు వేయనీయకుండా, ఓటు హక్కు వినియోగించుకోనీయకుండా చేస్తున్నారని పలువురు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు వెల్లడించారు. వీడీసీని కాదని నామినేషన్లు వేస్తే ప్రతీకారంతో ప్రాణహాని చేసేందుకు సైతం ప్రయత్నాలు చేసే అవకాశముందని, తమకు రక్షణ కల్పిస్తే నామినేషన్లు వేస్తామని ఫిర్యాదులో కోరారు.
వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్‌లో సర్పంచ్ పదవికి వీడీసీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. రూ.26,40,000 లకు వేలం వేసినట్లు తెలిసింది. అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఇద్దరు లేదా ముగ్గురితో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఉపసంహరణ సమయంలో కేవలం వేలంలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న వ్యక్తి నామినేషన్ మాత్రమే ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వ్యక్తుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు పలువురు తెలిపారు. తద్వారా వేలం పాడిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా పావులు కదిపినట్లు తెలుస్తోంది.
మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో ఎన్నికలకు సంబంధించి మరో ప్రత్యేక ఘటన వెలుగు చూసింది. మొరం, ఇసుక దందాలో ఆరితేరిన ఓ మాజీ సర్పంచ్, అతని కుమారులు అరాచకం చేస్తున్నట్లు పలువురు తెలిపారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుంటూ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు ఎస్సీ కమ్యూనిటీ వ్యక్తులను కిడ్నాప్ చేసి మాయమాటలు చెప్పి ఎన్నికలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమార్కులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను భయపెట్టి, ఇద్దరితో నామినేషన్లు ఉపసంహరణ చేయించి ఒకరిని మాత్రమే బరిలో ఉంచి ఏకగ్రీవం చేయించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. తద్వారా ఇసుక, మొరం దందాకు ఎదురు లేకుండా చేసుకునేందుకు కుయుక్తితో పథక రచన చేసినట్లు సమాచారం.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని
లెక్కచేయని పలు వీడీసీలు
సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులకు వేలం పాటలు
కొన్నిచోట్ల వేలంపాడిన వ్యక్తి కోసం డమ్మీ నామినేషన్లు
కలెక్టర్, సీపీలకు ఫిర్యాదు చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు


