పోలింగ్‌ను నిశితంగా పరిశీలించాలి
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతుల్లో
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● కీలక సూచనలు చేసిన
జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్
నిజామాబాద్ అర్బన్ : ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావు గా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు నియామకమైన మైక్రో అబ్జర్వర్లకు గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగల్గుతారని అన్నారు. పోలింగ్‌కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరుకొని సిబ్బందికి అందించే సామగ్రిని పరిశీలించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందా లేదా అన్నది నిశిత పరిశీలన చేసి, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని, ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని కలెక్టర్ హితవు పలికారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా, ఇతరులెవరికి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ అంకిత్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ సునీల్, మాస్టర్ ట్రైనర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
బోధన్ : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న బోధన్ డివిజన్‌లో సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో గురువారం ఎడపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ అమలు తీరు, పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ దత్తాద్రిలతో సమావేశమై సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి, విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలింగ్‌ను నిశితంగా పరిశీలించాలి


