కోడ్ పక్కాగా అమలు చేయాలి
నిజామాబాద్ అర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ ఇతర అధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన స్టేజ్–2 జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు.
ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాలపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎంపికై న సర్పంచ్ పోస్టులకు ఫారం10 ప్రకారం ఫలితాలు ప్రకటించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


