దొడ్డు వడ్లకు తిప్పలు
● క్వింటాలుకు ఐదు కిలోల వరకు కడ్తా
● రైతులను నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లు
సిరికొండ : దొడ్డు వడ్లు పండించిన అన్నదాతలను రైస్‌మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇష్టారీతిన కడ్తా తీస్తూ యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దొడ్డు రకం వడ్లు తీసుకోబోమని చెబుతూ సతాయిస్తున్నారు. ఒక్కో క్వింటాలుకు ఐదు కిలోల వరకు కడ్తా తీస్తుస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి, చీమన్‌పల్లి, పందిమడుగు గ్రామాల్లో దొడ్డు రకం వడ్లను ఎక్కువగా సాగు చేశారు. అయితే, దొడ్డు రకం వడ్లకు మిల్లర్లు తమకు నచ్చిన విధంగా కోత విధిస్తున్నారు. 40 కిలోల సంచికి చెత్త పేరిట కిలో చొప్పున క్వింటాలుకు రెండున్నర నుంచి మూడు కిలోల వరకు ఎక్కువ తూకం వేస్తున్నారు. ఇదే కాకుండా దొడ్డు రకం వడ్లకు అదనంగా క్వింటాలుకు ఐదు కిలోల వరకు కడ్తా తీస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.


