రోటరీ క్లబ్‌కు ఏటా రూ.2 లక్షలు
● ‘ధన్‌పాల్’ ట్రస్ట్ నుంచి ఆర్థికసాయం ప్రకటించిన అర్బన్ ఎమ్మెల్యే
● దివ్యాంగులకు ఉచిత కృత్రిమ
కాలు పంపిణీ
సుభాష్‌నగర్: దివ్యాంగ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న రోటరీ క్లబ్‌కు ప్రతియేటా రూ.2లక్షలు ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్త ట్రస్ట్ నుంచి అందిస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రకటించారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, జగిత్యాల్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ సర్వీసెస్ ట్రస్ట్ సహకారంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (జైపూర్ ఫుట్) పంపిణీ శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ధన్‌పాల్ సూర్యనారాయణ దివ్యాంగులకు కృత్రిమ కాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ కాలు అమర్చి వారికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్న రోటరీ సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌సీటీ చైర్మన్ ఆకుల అశోక్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ రాజు, కమల్ కిశోర్ ఇనాని, ధర్మపురి సురేందర్, బీజేపీ నాయకులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


