మా బిల్లులు వస్తవో.. రావో!
నివేదిక అందించాం..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో కొత్త పాలకవర్గం వస్తే తమ బిల్లులను చెల్లించడంతో నిర్లక్ష్యం జరుగుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో సుమారు రూ.15కోట్లు
జిల్లాలో పునర్విభజనకు ముందు 530 గ్రామ పంచాయతీలు ఉండగా మేజర్ పంచాయతీలలో ఎక్కువ, చిన్న పంచాయతీలలో తక్కువ పనులు సాగాయి. జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లకు బిల్లుల బకాయిలు దాదాపు రూ.15 కోట్ల వరకూ ఉంటుంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశారు. ఆ బిల్లులను గ్రామ పంచాయతీల ద్వారానే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఇలా పంచాయతీ నిధులతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లు బకాయిలు అలాగే ఉండిపోయాయి. బిల్లుల చెల్లింపుల కోసం మాజీ సర్పంచ్‌లు అనేకమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అయినా బిల్లు బకాయిల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వమే ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి.
తమకు పడనివారు వస్తే..
ఎన్నికలకు ముందుగానే ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఎంత మొత్తం బిల్లు బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం అధికారుల ద్వారా వివరాలను సేకరించింది. అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేసి బిల్లులను ట్రెజరీలో సమర్పించారు. కొన్ని పనులకు టోకెన్‌లు జారీ కాగా మరికొన్ని పనులకు టోకెన్‌లు ఇవ్వలేదు. ఎలాంటి నిధులు మంజూరైనా పంచాయతీ ఖాతాల్లోకే చేరుతాయి. ఈ నేపథ్యంలో తమకు పడనివారు సర్పంచ్‌లుగా ఎంపికై తే తమ బిల్లుల సంగతి అంతే అనే అనుమానాలను మాజీ సర్పంచ్‌లు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు విడుదలైతే పాత బిల్లులు చెల్లించకుండా కొత్త పనుల కోసం తీర్మాణం చేసే అవకాశం ఉంది. పాత బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా మాజీ సర్పంచ్‌లకు బిల్లుల చెల్లింపు గుదిబండగా మారిందని చెప్పవచ్చు.
గతంలో చేసిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను అందించాం. పంచాయతీ ఎన్నికల తరువాతనే బిల్లుల చెల్లింపులు జరుగుతాయి.
– శ్రీనివాస్‌రావు, డీపీవో, నిజామాబాద్
జీపీల పెండింగ్ బకాయిలపై
మాజీ సర్పంచుల ఆందోళన
కొత్త పాలకవర్గం వస్తే తమ బిల్లులు
చెల్లించడంలో నిర్లక్ష్యం
జరుగుతుందని ఆవేదన


