● వేసిన తాళాలు వేసినట్టు ఉన్నా
మాయమైన సామగ్రి
● విచారణ చేపట్టిన పోలీసులు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ప్రభుత్వ ఐటీఐ లో ఇటీవల ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్‌లో భారీ దొంగతనం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలోని ఏటీసీ సెంటర్‌కు వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా అందులోని సామగ్రి మా యం కావడంపై పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయగా, జిల్లాకేంద్రంలోని ఐటీఐలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఏటీసీని ప్రారంభించారు. అనంతరం ఏటీసీ సెంటర్‌కు సంబంధించిన వివిధ యంత్రాలు, వస్తువులను టాటా కన్సల్టెన్సీ సంస్థ సరఫరా చేసింది. కొన్నిరోజుల క్రితం సదరు సంస్థ కళాశాలలోని సామగ్రిని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. రెండు డెల్ మానిటర్స్, సీపీయూ, 12 జనరేషన్ యంత్రాలకు సంబంధించిన పలు బ్యాటరీలు, ఈవీ ప్యానెల్, ఆటో ఎమ్మార్వో యంత్రం, హ్యాండ్ టూల్స్, త్రీడి ప్రింటింగ్ సంబంధించి ఈవీ ఆటో పార్కింగ్ స్టాండ్, ఎయిర్ కంప్రెసర్, లేజర్ కటింగ్ మిషన్, రోబోటిక్స్, కాపర్ వైర్, కట్ సెక్షన్ బ్యాటరీస్ అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలుపగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రెండోటౌన్ ఎస్సై రామకృష్ణ ఐటీఐని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఏటీసీ సెంటర్లకు సంబంధించి ఎక్కడ కూడా తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. తాళం వేసిన డోర్లు, కిటికీలను పగలగొట్టిన ఆనవాళ్లు ఎక్కడ లేవు. ఐటీఐలో పనిచేస్తున్న వారే వివిధ వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. సుమారు రూ.10 లక్షల విలువ చేసే వివిధ యంత్రాలు, మెటీరియల్ చోరీ అయినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఏటీసీ సెంటర్‌లో భారీ చోరీ


