అశోక్‌సాగర్‌లో ఒకరి ఆత్మహత్య
బోధన్: పట్టణంలోని అనీసా నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ముత్యాల రమ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. బోధన్‌లోని అనీసానగర్ కాలనీకి చెందిన వంట మాస్టర్ మహమ్మద్ యూసుఫ్(59) ఆదివారం నవీపేటలో ఓ శుభకార్యం కోసం వంట చేసేందుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పాడు. కానీ కుటుంబసభ్యులు ఈ వయస్సులో పని చేయడం ఎందుకు అంటూ అడ్డుకున్నారు. దీంతో తనను పని చేయనివ్వడం లేదంటూ అతడు జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో ఎడపల్లి మండలం జానకంపేట శివారులోని అశోక్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు మృతదేహం బయటకు తేలడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
● ఇద్దరికి తీవ్ర గాయాలు
డిచ్‌పల్లి(జక్రాన్‌పల్లి): జక్రాన్‌పల్లి పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై ఓ వ్యాన్‌ను ప్రయివేట్ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. ఓ ఐచర్ వ్యాన్ ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ వైపు నుంచి ఆర్మూర్ వైపునకు వెళుతోంది. అదే సమయంలో రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రయివేట్ బస్సు వ్యాన్ వెనుకాల వస్తోంది. జక్రాన్‌పల్లి తండా శివారులో వ్యాన్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ ఎండీ మస్తాన్, ఐషర్ వ్యాన్ డ్రైవర్ మంగీలాల్‌కు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
డిచ్‌పల్లి: వరి ధాన్యం బస్తాల లోడ్‌తో రైస్‌మిల్లుకు వెళుతున్న లారీ డిచ్‌పల్లి మండలం సాంపల్లి శివారులో బోల్తా పడింది. వివరాలు ఇలా.. రాంపూర్ సొసైటీ పరిధిలోని మిట్టాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలను సోమవారం లారీలో లోడ్ చేసి, సాంపల్లి సమీపంలోని రైస్‌మిల్లుకు తరలించారు. సాంపల్లి శివారులో 44వ నెంబరు జాతీయ రహదారిపై లారీ యూటర్న్ చేస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న ధాన్యం బస్తాలు కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మరో లారీ తీసుకువచ్చి ధాన్యం బస్తాలను రైస్‌మిల్లుకు తరలించారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఇద్దరిపై దాడి వేసి, గాయపర్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని వీధుల్లో కుక్క పరుగెడుతూ కమ్మరి సంగవ్వ, ఆకుల స్వామిని కాటు వేసింది. శనివారం సైతం ఒకరిని పిచ్చికుక్క కాటు వేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి కుక్కల బెడదను నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.
అశోక్‌సాగర్‌లో ఒకరి ఆత్మహత్య


