ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● కమిషన్ మార్గదర్శకాలకు
అనుగుణంగా పనిచేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ
సుభాష్‌నగర్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై శనివారం పునఃశ్చరణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నియమ, నిబంధనలపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చన్నారు. ఎన్నికల సంఘం అందించిన హ్యాండ్‌బుక్‌ను చదువుకొని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరఫున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని అభ్యర్థి పేరును అక్షర క్రమం కోసం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ‘నోటా‘ సింబల్‌ను కూడా తప్పనిసరిగా చేర్చాలన్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. శిక్షణ తరగతుల్లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, డీఎల్పీవో శ్రీనివాస్, ఆర్‌వోలు, సహాయ ఆర్‌వోలు పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి


