దీక్షాదివస్ టెంట్ కూల్చివేత
● కార్యక్రమ నిర్వహణకు
అనుమతి నిరాకరణ
● వర్సిటీ పరిపాలనా భవనం వద్ద
బీఆర్‌ఎస్ నేతల బైఠాయింపు
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ గేటు బయట దీక్షా దివస్ కోసం వేసిన టెంట్ కూల్చివేసి, మైక్ తీసివేయడమే కాకుండా ఫ్లెక్సీ చించివేత వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమం కోసం శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్‌ఎస్ నాయకులు తెయూ మెయిన్ గేట్ బయట టెంట్ వేశారు. ఉదయం 10 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాజారాం యాదవ్ వర్సిటీ వద్దకు చేరుకునేసరికి టెంట్ కూల్చివేసి, మైక్ తొలగించి కనిపించింది. ఈ విషయమై వర్సిటీ సెక్యూరిటీ సిబ్బందిని అడుగగా వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెంట్‌ను తామే తొలగించినట్లు తెలిపారు. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఫోన్‌లో సంప్రదించగా దీక్షా దివస్‌కు వీసీ అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. వీసీని ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి రాజారాం యాదవ్ వర్సిటీ పరిపాలనా భవనం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ దీక్షా దివస్‌కు మొదట అనుమతి ఇచ్చి, తర్వాత నిరాకరించడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని ఆ రోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలి తమే తెలంగాణ ఏర్పాటని పేర్కొన్నారు. సమైక్య పాలకులు కూడా ఇలా వ్యవహరించలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒత్తిడితోనే దీక్షా దివస్‌కు వర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సంతోష్, నాగేంద్ర, నిరంజన్, బీఆర్‌ఎస్ నాయకులు పాశం కుమార్, యూసుఫ్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డిచ్‌పల్లి ఎస్సై ఎండీ ఆరీఫ్ బందోబస్తు నిర్వహించారు.
దీక్షాదివస్ టెంట్ కూల్చివేత


