డిజిటలైజేషన్‌తో సత్ఫలితాలు
● హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ తంగిరాల మాధవీదేవి
సుభాష్‌నగర్: కాగితాల నుంచి కంప్యూటర్ల వైపు ప్రపంచం పరుగులు పెడుతోందని, డిజిటలైజేషన్ మంచి ఫలితాలు ఇస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టులో డాక్యుమెంట్ స్కానింగ్ సెంటర్ (రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్ట్)ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, అదనపు జిల్లా జడ్జిలు హరీష, శ్రీనివాస్‌లతో కలిసి హైకోర్టు న్యాయయూర్తి ప్రారంభించారు. అనంతరం బార్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. కోర్టులలో న్యాయ వివాదాల దావాలు, క్రిమినల్ కేసుల కాగితాల కట్టల మూటలను కనబడని రీతిలో కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తామని తెలిపారు. యువ న్యాయవాదులు నిరంతరం అభ్యసించాలని, ఉద్యోగ నియామకాలు వచ్చినప్పుడు వాటిని ఒడిసి పట్టుకోవాలని ఆమె ఉద్భోదించారు. భీమ్‌గల్ మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు ఆర్థిక అనుమతులు వచ్చాయని, త్వరలోనే కోర్టు ఏర్పాటు అవుతుందని ఆమె వివరించారు. ఓల్డ్ విద్యాశాఖ ఖాళీ స్థలాన్ని జిల్లాకోర్టు అవసరాలకు అనుగుణంగా కేటాయించేందుకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సమన్వయం ఉందని ఆమె అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు సాయరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ, గోపీకృష్ణ, హరి కుమార్, చైతన్య, శ్రీనివాస్ రావు, ప్రభుత్వ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


