స్థానిక ఎన్నికల్లో విజయం మాదే..
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి
● ఘనంగా దీక్షా దివస్
నిజామాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని, ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం దీక్షా దివస్ నిర్వహించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నాటి దీక్షా దివస్ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రమని గుర్తు చేశారు. తెలంగాణ అనే చెట్టు తల్లికి కేసీఆర్ వేరు లాంటి వ్యక్తి అని, ఆయన పేరు చెరిపివేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చిత్తుగా ఓడిపోతాయని, బీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని అంతం చేస్తామని, రేవంత్ సర్కారు మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు తొలి ప్రజాప్రతినిధిని అందించిన జిల్లా ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ నీతు కిరణ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


