ఎన్నికలపై వీడీసీ పెత్తనం!
నిజామాబాద్‌అర్బన్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వేడి రాజుకుంది. నామినేషన్ల స్వీకరణ మొదలవ్వడంతో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, పంచాయతీ ఎన్నికలపై గ్రామాభివృద్ధి కమిటీలు కొన్ని పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలిసింది. తాము నిర్ణయించిన వారే నామినేషన్ దాఖలు చేయాలని తీర్మానిస్తున్నట్లు సమాచారం. పలుచోట్ల పోటీకి ముందుకొస్తున్న వారికి వీడీసీలు కళ్లెం వేస్తున్నాయి.
వీడీసీలను ప్రసన్నం చేసుకుంటేనే..
సర్పంచ్, వార్డు మెంబర్‌గా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు మొదట గ్రామాభివృద్ధి కమిటీలను మచ్చిక చేసుకుంటున్నారు. వారు చెప్పిందే వినడం, వారు అడిగింది ఇవ్వడం, వ్యక్తిగతంగా వీడీసీ సభ్యులను కలవడం జరుగుతోంది. వివిధ రాజకీయ పార్టీ నాయకులు సైతం వీడీసీలను సంప్రదించి తమకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని పేర్కొనడం గమనార్హం.
కలెక్టర్ ప్రకటించాల్సిందే..
ఎన్నికల సంఘం ఈ సారి పంచాయతీ ఎన్నికలకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికై తే దానిని ప్రకటించే బాధ్యత కలెక్టర్‌కే అప్పగించింది. ఏకగ్రీవమైన సర్పంచ్‌ను కలెక్టర్ పూర్తిస్థాయిలో పరిశీలించి నియమ నిబంధనల ప్రకారం ఉంటేనే ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించాల్సి వస్తుంది.
వేలంతో ఏకగ్రీవం..
జిల్లాలోని 545 గ్రామ పంచాయతీలు, 5,025 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మొదటి విడత బోధన్ డివిజన్, రెండో విడత నిజామాబాద్, మూడో విడత ఆర్మూర్ డివిజన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్‌లో ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గ్రామాభివృద్ధి కమిటీలు పెత్తనం కొనసాగిస్తున్నాయి. బోధన్ డివిజన్‌లోని వర్ని మండలంలో నామినేషన్ల స్వీకరణ తొలి రోజే రెండు సర్పంచ్ పదవులకు వీడీసీలు తీర్మానాలు చేసినట్లు సమాచారం. సంబంధిత గ్రామాల్లో వారు నిర్ణయించిన వారే సర్పంచ్‌గా పోటీ చేయాలని, మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకూడదని తేల్చి చెప్పారు. దీంతో వీడీసీ నిర్ణయించిన వారే నామినేషన్లు వేశారు. ఆర్మూర్ డివిజన్‌లో ప్రస్తుతం గ్రామాభివృద్ధి కమిటీలతో ఆశావహుల చర్చలు కొనసాగుతున్నాయి. అంతేకాక గ్రామాభివృద్ధి కమిటీకి నిర్ణయించిన డబ్బులు చెల్లించిన వారే పోటీ చేయాలని కొన్ని గ్రామాలలో నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్మూర్ మండలంలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి గ్రామాభివృద్ధి కమిటీ నలుగురు సర్పంచ్ పోటీదారులతో చర్చించి తాము చెప్పినంత డబ్బులు చెల్లించిన వారే పోటీ చేయాలని తేల్చి చెప్పారు. జక్రాన్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించింది.
సర్పంచ్, వార్డు మెంబర్ల
పదవులకు వేలం
ఏకగ్రీవానికి ప్రయత్నాలు
తాము నిర్ణయించే వారే నామినేషన్లు
దాఖలు చేయాలని హుకుం


