సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలు, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో మండలాల వారీగా సాధించిన ప్రగతిని పరిశీలించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలను తిరస్కరిస్తే కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.


