అభ్యర్థులకు ‘బ్యాంక్ ఖాతా’ కష్టాలు
● కొత్త అకౌంట్ ఉండాల్సిందేనని
నిబంధన
● బ్యాంక్‌ల వైపు అభ్యర్థుల పరుగులు
బోధన్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ రెండోరోజు శుక్రవారం కొనసాగింది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీచేసే వారు నామినేషన్ పత్రాలతోపాటు కొత్త బ్యాంక్ అకౌంట్ (జీరో బ్యా లెన్స్) కచ్చితంగా జతచేయాలని అధికారులు ని బంధనలు జారీ చేశారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వారికి ఆర్వోలు కొత్త నిబంధనలు తెలపడంతో అభ్యర్థులు అవాక్కయ్యారు. ఇప్పటికిప్పుడే కొత్త బ్యాంక్ అకౌంట్‌లు ఎలా సాధ్యమవుతాయని పలువురు ఆర్వోలతో వాదనకు దిగారు. చివరికి చేసేదేమి లేక బ్యాంక్‌ల వైపు పరుగులు పెట్టారు. సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన అడ్డకట్ల గంగాధర్ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలుకు సాలంపాడ్ క్యాంప్ నామినేషన్ కేంద్రానికి వెళ్లగా కొత్త బ్యాంక్ అకౌంట్ జత చేయాలని ఆర్వోలు సూచించారు. ఆర్వోలతో కొద్దిసేపు వాదించి చివరకు సాలంపాడ్ క్యాంప్ ఎన్‌డీసీసీబీ జీరో బ్యాలెన్స్ కొత్త అకౌంట్ తీసుకొని నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి పాత నిబంధనల మేరకు బ్యాంకు ఖాతా తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.


