ఏకగ్రీవాలకు నజరానా లేనట్టేనా?
స్పష్టత రాలేదు..
● గతంలో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే జీపీలకు
ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం
● ఈసారి ఎన్నికలపై స్పందించని వైనం
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల్లో పోలింగ్ తంతు లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు సభ్యులను ఎంపిక చేస్తే నజరానా అందించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడినప్పటికి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
2019లో రూ.15లక్షలు ప్రకటించినా..
గ్రామాలలో రాజకీయ కక్షలు పెరగకుండా ఉండాలంటే గ్రామస్తులు అంతా కూర్చుని ఏకగ్రీవ పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యులు, అందులోనే ఉపసర్పంచ్‌ను ఎన్నుకునే ఆనవాయితీని ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతం చేశారు. ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధుల ను ఎంపిక చేసిన పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వడం వల్ల అభివృద్ధి జోరుగా సాగుతుందనే ఉద్దేశ్యంతో అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు రూ.1లక్ష నుంచి రూ. 5లక్షల వరకూ ప్రోత్సాహకాలను అందించారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ ప్రోత్సాహకాన్ని రూ.15 లక్షలకు పెంచింది. దీంతో అప్ప ట్లో జిల్లాలో 130 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగానే ప్రజాప్రతినిధుల ఎంపిక జరిగింది. కానీ నిధుల కొరతతో ఏ ఒక్క పంచాయతీకి ఏకగ్రీవ నజరానాను అప్పట్లో ప్రభుత్వం అందించలేదు. ఈసారి మూడు విడతల్లో ఎన్నికలను జరుప నుండగా తొలివిడత సంగ్రామం మొదలైనా ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రో త్సాహం విషయంపై స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎంపిక జరిగే పంచాయతీలకు నజరానా అందడం అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తే ఈ అంశాన్ని అన్ని గ్రామాల ప్రజలకు తెలియచేస్తాం. – శివకృష్ణ, డీఎల్‌పీవో, ఆర్మూర్
ఏకగ్రీవాలకు నజరానా లేనట్టేనా?


