రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలి
● నాణ్యతతో చేపట్టేలా పర్యవేక్షించాలి
● ఆర్‌అండ్‌బీ అధికారులకు
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశం
సుభాష్‌నగర్:ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపర్చేందుకు వీలుగా చేపడుతున్న రోడ్డు మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతినగా అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద, బైపాస్ రోడ్డు, డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై కొనసాగుతున్న రోడ్ల మరమ్మతులను శుక్రవారం క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.
కాగా నగరంలో గోల్ హనుమాన్ నుంచి పూసలగల్లికి వెళ్ళే మార్గంలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న ప్రాంతాలను సైతం కలెక్టర్ పరిశీలించారు. తక్షణమే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, మరోమారు క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతోపాటు పనుల ప్రగతిని సమీక్షిస్తానని అన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రవీణ్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్రసాగర్, ఇనాయత్ తదితరులు ఉన్నారు.


