భర్త దాడిలో భార్య మృతి
బోధన్: భర్త క్షణికావేశంలో భార్యపై దాడిచేయగా మృతిచెందిన ఘటన ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. ఎమ్మెస్సీ ఫారం గ్రామంలో మహ్మద్ హుస్సేన్ అతడి భార్య సుల్తానా బేగం(50) నివాసం ఉంటున్నారు. దంపతులకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈక్రమంలో సుల్తానాబేగం గురువారం సాయంత్రం పక్కింట్లోకి వెళ్లి, మద్యం తాగుతోంది. ఈ సమయంలో భర్త హుస్సేన్ అక్కడికి వచ్చి ఆవేశంతో సుల్తానాను మెడపట్టి గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లగా, ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. అప్పటికే ఆమె మృతిచెందడంతో మృతురాలి కొడుకు ఖాదర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మద్యం మత్తులో కిందపడిన వ్యక్తి..
బోధన్: మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా..బోధన్ పట్టణం పాన్‌గల్లికి చెందిన బొద్దుల నరేందర్(46)కు 20 ఏళ్లక్రితమే వివాహం జరిగింది. పిల్లలు కలగకపోవడంతో మూడేళ్ల క్రితం అతడిని భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నరేందర్ మద్యానికి బానిసై సంచరిస్తూ, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం రాత్రి అతడు మద్యం తాగి వెళుతుండగా జానకంపేట రైల్వే గేట్ వద్ద రోడ్డు కింద పడిపోయి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి వారు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడిని నరేందర్‌గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధుడి ..
మోపాల్: అగ్నిప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రానికి చెందిన జక్కు దేవయ్య (74) ఈనెల 17న తన పొలంలో కోసిన గడ్డికి నిప్పు పెట్టాడు. మంటలు వ్యాపించి దేవయ్యకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి కొడుకు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
భర్త దాడిలో భార్య మృతి
భర్త దాడిలో భార్య మృతి


