జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన చిట్టబోయిన అంజయ్య(42) గురువారం తన భార్యను వైద్యం కోసం కామారెడ్డిలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులకు చూపించిన అనంతరం ఆమెను బస్సు ఎక్కించి ఇంటికి పంపాడు. కానీ అతడు ఇంటికి వెళ్లలేదు.
శుక్రవారం ఉదయం జంగంపల్లి గ్రామ శివారులోని ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అంజయ్యకు అప్పులు ఎక్కువ అవడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
రుద్రూర్: పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. వివరాలు ఇలా.. బిచ్కుంద మండలం చిన్నదడ్గి గ్రామానికి చెందిన మణిగిరి లక్ష్మి (38)కి పోతంగల్ మండలం మల్లికార్జున్‌తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్త మద్యానికి బానిస కావడం, లక్ష్మి అనారోగ్యంతో బాధపడటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో లక్ష్మి జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


