చట్టబద్ధ దత్తత శ్రేయస్కరం
● జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ
నిజామాబాద్ నాగారం: చట్టబద్ధంగా దత్తత తీసుకోవడం శ్రేయస్కరమని జిల్లా సంక్షేమ అధికారి రసూల్‌బీ పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో స్థానిక వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో పిల్లల దత్తతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జనరల్ పిల్లలతోపాటు స్పెషల్ నీడ్ పిల్లలకు కూడా అమ్మానాన్నల ఆవశ్యకత ఉంటుందని, ప్రేమ ఆప్యాయత అవసరమని, వారిని వైకల్యం పేరుతో దూరం పెట్టకూడదని, దత్తత తీసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో దత్తత ప్రక్రియపై అవగాహన కల్పిస్తామని, ఈ ఏడాది స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అడాప్షన్ అంశాన్ని ఎంచుకున్నామన్నారు. కార్యక్రమంలో సీడీపీవోలు సౌందర్య, జ్యోతి, శిశు గృహ మేనేజర్ అనిత, అనిల్, డీసీపీయూ సిబ్బంది, దత్తత కోరుకునే తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


