పోలీసులమంటూ బెదిరింపులు
● ముగ్గురిపై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్
కామారెడ్డి క్రైం: పోలీసుల పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను దేవునిపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి నిల్చొని ఉండగా కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి పోలీసులమంటూ బెదిరించారు. అతని వద్దనున్న రూ.1,800 నగదు, సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. గురువారం సరంపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి ఓ కారులో వచ్చిన వారు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకొని విచారించారు. చిన్నమల్లారెడ్డి గ్రామం వద్ద చేసిన దారి దోపిడీ నేరాన్ని అంగీకరించారు. నిందితులను రాజంపేటకు చెందిన జింక భాస్కర్, గుర్రాల లక్ష్మణ్‌గా గుర్తించారు. మరో నిందితుడు రంగ నవీన్ గౌడ్ పరారీలో ఉన్నాడు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.


