విద్యుదాఘాతంతో ఒకరి మృతి
● ఆలస్యంగా వెలుగులోకి..
నందిపేట్ (ఆర్మూర్): విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘటన నందిపేట మండలం కౌల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ నెల 22న చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. వెల్మల్ గ్రామానికి చెందిన ఇస్సపల్లి గంగాధర్‌కు గ్రామశివారు, రైతుఫారం గ్రామ సమీపంలో పొలం ఉంది. ఆ పొలంగట్లపై ఉన్న టేకు చెట్ల కొమ్మలు తొలగించేందుకు కౌల్‌పూర్ గ్రామానికి చెందిన ఉమ్మెడ సాయిలు, గోపు సాయిలు (40) కలిసి శనివారం ఉదయం వెళ్లారు. ఆ చెట్ల మీదుగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ గమనించకుండా కొమ్మలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో గోపు సాయిలుకు విద్యుత్ షాక్ తగలడంతో చెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. మృతుడు సాయిలుకు భార్య శ్రావణి, కూతురు అక్షిత, కుమారుడు ప్రణయ్ ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ తమను పోషించే కుటుంబపెద్ద చనిపోవడంతో భార్య శ్రావ ణి కన్నీళ్ల పర్యంతమైంది. విద్యుత్ శాఖ అధికారులు తమను ఆదు కోవాలని వేడుకుంటోంది.
చికిత్స పొందుతూ ఒకరు..
రాజంపేట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజంపేట మండలం గుడితండాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుడితండా గ్రామానికి చెందిన మెగావత్ సామ్య, ఫన్నీ దంపతులు బుధవారం బైక్‌పై ఎల్లారెడ్డిపల్లి నుండి గుడితండాకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా బానోత్ అనే వ్యక్తి పల్సర్ బైకుపై వచ్చి ఢీకొట్టాడు. దీంతో సామ్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పతిక్రి తరలించారు. గురువారం చికిత్స పొందుతూ సామ్య మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భార్య ఫన్నీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్ రాజు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
మోర్తాడ్: మండలంలోని గాండ్లపేట శివారు పెద్దవాగుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. జగిత్యాల్ జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన పేర్ల కృష్ణ(44) తన స్నేహితుడు కోట సమ్మయ్యతో కలిసి ఆర్మూర్‌కు వెళుతుండగా వంతెనపై ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బాఽధిత కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వివరించారు.


