భక్తజన సంద్రం నింబాచలం
కనుల పండువగా సాగిన రథోత్సవం గోవింద నామస్మరణతో మార్మోగిన లింబాద్రి గుట్ట స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది జనం
భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామి వారి ఊరేగింపు
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్) : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భీమ్‌గల్ నింబాచలం గోవింద నామస్మరణ తో మారుమోగింది. ప్రతియేటా నిర్వహించే నింబాచలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహాస్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసు దేవాచార్యులు ఇతర అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి రథ ప్రతిష్ట కా ర్యక్రమం జరిగింది. వేద మంత్రాలతో శ్రీమన్నారాయణుడిని ఆహ్వానించి షోడశోపచార పూజలు ని ర్వహించారు. రథ ప్రథమ స్థలంలో గరుత్మంతునికి ప్రాణప్రతిష్ఠ చేశారు. రథానికి జీవకళ చేకూర్చేందుకు తత్వన్యాస చేశారు. రథచక్రాల్లోకి ప్రతాప వంతుడైన వాయు పుత్రుని ఆహ్వానించారు. స్తంభాది మొదలగు అభిమాన దేవతలకు రథ శక్తి హోమం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు తక్షకుడిని, కర్కోటకుడిని ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ట చేశారు. రథ ప్రతిష్ఠ సంపూర్ణ ఫలం కోసం హోమం పూర్ణా హుతి నిర్వహించి అగ్నిహోత్రానికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తమైన రథ ప్రతిష్ఠా హోమముచే జీవకళలు ఉట్టి పడేట్టూ రథం స్వర్ణాలంకార శోభితమై నాలుగు దిక్కులకు భగవంతుని పటములను అలంకరించారు. రథం మూడవ తలంలో భగవంతుని సింహాసన స్థలంలో శ్రీ లక్ష్మీనృసింహుడి మో యుటకు సిద్ధముగా ఉన్న గరుత్మంతునితో అలరా రే మహారథానికి పూర్వ ప్రతిష్ఠా కుంభంతో ప్రోక్ష ణ, అష్టదిక్కులకు బలి ప్రదానం చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మ ధ్య రథాన్ని లాగుతూ ముందుకు కదిలారు.
రథోత్సవాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువ జాము నుంచి పుష్కరిణి వీధుల గుండా మెట్ల మార్గం ద్వారా గర్భాలయంలో స్వామి వారి వరకు భక్తుల రద్దీ కనిపించింది. జాతరను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వర్ణాలంకరణ చేశారు. దేదీప్యమానమైన స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు.
రథోత్సం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సైలు సందీప్, అనిల్‌రెడ్డి, రాము, రాజేశ్వర్, సంజీవ్ తదితరులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. గర్భాలయంలోని మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెళ్లే భక్తుల క్రమబద్ధీకరణ నుంచి రథోత్సవం ముగిసే వరకు బందో బస్తు చర్యలను నిర్వహించారు. రథోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి పాల్గొన్నారు.
భక్తజన సంద్రం నింబాచలం
భక్తజన సంద్రం నింబాచలం


