కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్య
● భర్త ఇంటిపై మృతురాలి బంధువుల దాడి
వర్ని: కుటుంబ సమస్యలతో ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్ని మండలం శంకోరా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకోరా గ్రామానికి చెందిన పాల్త్య సాత్విక(30)కు మాక్లూర్ మండలం మాణిక్‌బండార్‌కు చెందిన గణేశ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన సాత్విక బుధవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు బోధన్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు తెలిపారు. సాత్విక మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, మాణిక్‌బండార్ గ్రామస్తులు శంకోరా గ్రామానికి చేరుకొని భర్త గణేశ్ ఇంటిని ధ్వంసం చేశారు. గణేశ్ ఇంటిని ధ్వంసం చేస్తున్న సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా ఆగ్రహించిన మృతురాలి బంధువులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు.


