‘పది’ ఫీజులో ప్రైవేట్ దందా
● రూ.125 ఫీజుకు రూ. వెయ్యి వసూలు
● ప్రైవేటు పాఠశాలల నిర్వాకం
● కొరవడిన విద్యాశాఖ పర్యవేక్షణ
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజును జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా రాబడుతున్నాయి.
ఖలీల్‌వాడి: పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజును ఈ నెల 13 వరకు చెల్లించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని ప్రవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. జిల్లాలో 233 ప్రైవేటు పాఠశాలలు ఉండగా అందులో 10,511 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ప్రత్యేక తరగతుల పేరిట..
పదో తరగతి చదివే విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు రూ.125 చెల్లించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ప్రైవేటు స్కూళ్లు మాత్రం రూ.1,000 వసూలు చేస్తున్నాయి. అధిక ఫీజుపై తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నిస్తే వచ్చే పరీక్షల్లో తమ పిల్లలకు ఇబ్బందులు తప్పవని భావించి అడిగినంత చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు అందిన కాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా ప్రత్యేక తరగతులు, రోజువారీ స్లిప్ టెస్ట్‌లు, గైడ్స్ వంటి వాటి పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నా యి. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజులను అరికట్టాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


