ప్రత్యేక లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
● జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి
నిజామాబాద్ లీగల్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్‌లో జడ్జిలు, న్యాయవాదులతో ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక లోక్ అదాలత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఆలోచనల నుంచి ఉద్భవించిందని అన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో లోక్ అదాలత్‌లో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రాజీ పడదగిన కేసులు పేరుకుపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వాటిని లోక్ అదాలత్ పరిష్కరించడమే మేలని జడ్జి తెలిపారు. ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో న్యాయవాదుల సహకారం చాలా అవసరమని అన్నారు. న్యాయవాదుల ప్రమేయం లేకుండా కేసులను రాజీ చేయబోమని, పోలీసు శాఖ కూడా స్పెషల్ లోక్ అదాలత్‌కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని జడ్జి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్, ఆశాలత, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయారెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ, గోపికృష్ణ, హరికుమార్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేశ్, కోశాధికారి నారాయణ దాసు తదితరులు పాల్గొన్నారు.


