పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి
నిజామాబాద్‌అర్బన్/ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింత మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంఈవోలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా చొరవ చూపాలన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యను బోధిస్తూ, ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలని, ప్రత్యేకించి పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. యూడైస్‌లో వివరాలను నమోదు చేయడంతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ పద్ధతిలో శత శాతం అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ జలాలను అందిచాలని, లైబ్రరీ, కిచెన్ గార్డెన్ నిర్వహించాలని అన్నారు. విద్యుత్ సదుపాయం, కంప్యూటర్ల మరమ్మతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ బడులతోపాటు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు అపార్ జనరేట్ అయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. భవిత కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించంతోపాటు కస్తూర్బా విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, కాంప్లెక్స్ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
అపార్, యూడైస్ పనులు పూర్తి చేయాలి
ఎండీఎం ఏజెన్సీల నిర్వాహకులకు ఆరోగ్య పరీక్షలు..
సమీక్షాసమావేశంలో
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి


