మక్క రైతుకు మంచి కబురు
● కొనుగోలు పరిమితిని పెంచిన ప్రభుత్వం
● ఎకరానికి 25 క్వింటాళ్లు
సేకరించాలని ఆదేశాలు
● జిల్లా కలెక్టర్ రాసిన లేఖకు స్పందన
డొంకేశ్వర్(ఆర్మూర్) : మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కబురు చెప్పింది. మక్క కొనుగోళ్లపై విధించిన పరిమితిని ఎత్తివేసింది. ఇది వరకు ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేయగా, ఇప్పుడు ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు సేకరించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం తమకు ఆదేశాలు అందినట్లు మార్క్‌ఫెడ్ డీఎం దాసోజు మహేశ్ తెలిపారు. ఆదేశాలు అందిన వెంటనే కొనుగోళ్లు చేపడుతున్న సొసైటీలకు అధికారులు సమాచారం చేరవేశారు. మక్క కొనుగోలు పరిమితి పెంచే విషయంలో కలెక్టర్ వినయ్ కృష్టారెడ్డి చేసిన కృషి ఫలించిందని చెప్పొచ్చు. కొనుగోలు కేంద్రాలను ఆయన పర్యవేక్షిస్తున్న సమయంలో ప్రభుత్వం విధించిన సీలింగ్ కారణంగా పంటను పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతుల మేలు కోసం కలెక్టర్ గత నెల 25న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎకరానికి 28 క్వింటాళ్లు సేకరించేలా అనుమతులు ఇవ్వాలని కోరారు. లేఖ రాసిన పది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి 25 క్వింటాళ్లకు అనుమతి ఇచ్చింది. పరిమితి పెంపుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు కృతజ్ఞలు తెలుపుతున్నారు. అయితే జిల్లాలో మక్కల కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే చేపడుతున్న నేపథ్యంలో మక్కల సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన 33 సెంటర్ల ద్వారా 15వేల మెట్రిక్ టన్నుల మక్కలను 4,500మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. 25వేల మెట్రిక్ టన్నుల సేకరణ మార్క్‌ఫెడ్ అధికారుల లక్ష్యంగా కాగా, పరిమితి పెంచడంతో 30వేల మెట్రిక్ టన్నులు దాటే అవకాశముంది. అయితే దళారులు కోల్డ్ స్టోరేజీల్లో ఉంచిన మక్కలను రైతుల పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించకుండా అధికారులు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైతుల శ్రేయస్సు కోసం మక్కల కొనుగోలు పరిమితిని పెంచాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు పెంచడం సంతోషంగా ఉంది. దీని వల న కష్టపడి పంట పండించిన రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇందుకు రైతులందరి తరఫున కలెక్ట ర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బార్ల భరత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్, డొంకేశ్వర్


