బాల్కొండ: చిట్టాపూర్ గ్రామానికి చెందిన తూం రాజనారాయణ(40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజనారాయణ ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో ఆదివారం వివాహానికి హాజరై తిరిగి చిట్టాపూర్ గ్రామానికి వెళ్తూ జాతీయ రహదారి 44 దాటుతుండగా నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టింది. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు.
లక్ష్మాపూర్‌లో ఒకరు..
వర్ని: చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన బొంతల సాయిలు (45)చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య రాధా ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్తాపంతో సాయిలు నాలుగు నెలల క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


