
రెండు రోజుల్లో పేకాడుతున్న 81 మంది అరెస్ట్
● రూ. 85వేలు నగదు స్వాధీనం ● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పేకాడుతున్న 81 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.85వేల నగదు, 41 సెల్‌ఫోన్‌లు, 9 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పేకాడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశామన్నారు. పేకాట, చట్ట వ్యతిరేక కార్యకలపాలను సహించేది లేదన్నారు. దీపావళి నేపథ్యంలో పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పేకాడితే పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 87126 86133కు గానీ, డయల్ 100కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
బట్టాపూర్‌లో..
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని బట్టాపూర్‌లో ఒక ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్వర్ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,01,280 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఐదు సెల్‌ఫోన్లు, 3 బైక్‌లను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు.