
క్రైం కార్నర్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయికి చెందిన గాంధారి రమేష్ (40) ఈనెల 14న ఉదయం మొక్కజొన్న కొట్టడానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం అతడు ఇంటికి రాగా, కొద్దిసేపటికే మళ్లీ బయటకు వెళ్లాడు. రాత్రయినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు తాడ్వాయి బస్టాండ్ దగ్గర అతడు కిందపడి ఉండటంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 18న సాయంత్రం రమేష్ మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తవ్వ, కూతుర్లు కీర్తన, శృతి ఉన్నారు. మృతుడి భార్య ముత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
మోపాల్ మండలంలో మహిళ..
మోపాల్: మండలంలోని గుడి తండాలో శనివారం రాత్రి జరిగిన దాడి ఘటనలో ఓ మహిళ గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన రుదవత్ నీలాబాయి (41), భర్త వామన్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్, తన భార్యతో కలిసి గ్రామంలోనే ఆటో నడుపుకుంటున్నాడు. ఇటీవల వారి కుటుంబంలో కలహాలు నెలకొనగా, శనివారం రాత్రి వామన్, వినోద్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరిని నీలాబాయి సముదాయించే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తుడైన వామన్ ఆమె తలపై కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వామన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.