
కొండంత అవినీతి.. గోరంత రికవరీ
గత ఐదేళ్లలో జిల్లాలో ఉపాధిహామీ పనుల్లో గుర్తించిన అక్రమాలు..
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్) : గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అక్రమార్కులకు వరంగా మారింది. ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మండల అధికారుల వరకు అందినకాడికి దండుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలను గుర్తిస్తున్న ఉన్నతాధికారులు అవినీతి సామ్మును తిరిగి రాబట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అవినీతి కొండలా పెరిగిపోతోంది.
ఏటా లక్షల్లో అవినీతి..
ప్రతి ఏడాది ఉపాధి సామాజిక తనిఖీ బృందాలు గ్రామాల్లో పర్యటించి ఆ ఏడాది కాలంలో చేపట్టిన పనులను పరిశీలిస్తాయి. గ్రామసభల్లోనే అక్రమాలను వెల్లడిస్తారు. అలాగే మండలస్థాయిలో నిర్వహించే సామాజిక తనిఖీ ప్రజావేదికలో గ్రామాల వారీగా జరిగిన అవినీతిని వెల్లడిస్తూ నివేదికను జిల్లా ఉపాధిహామీ అధికారులకు అందిస్తారు. అయితే అవినీతి సొమ్ము రికవరీ మాత్రం జరగడం లేదు. గత ఐదేళ్లలో రూ.6,57,08404 (రూ.6.57 కోట్లు) అవినీతి జరగగా, ఇంతవరకు కేవలం రూ.14,64,450 (రూ.14.64లక్షలు) సొమ్ము మాత్రమే రికవరీ చేయడం గమనార్హం.
గత ఐదేళ్లలో 471 మంది అధికారులకు రూ.33.61 లక్షల జరిమానా విధించారు. అవినీతి సొమ్ము రికవరీ కోసం అయితే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమాలు జరుగుతున్నా..
చేయని పనులను చేసినట్లు చూయించి బిల్లులు డ్రా చేయడం, కూలీల హాజరులో అక్రమాలు ఇలా గ్రామ స్థాయిలో చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడుతున్నారు. అయితే సామాజిక తనిఖీ బృందాలు ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందించిన తర్వాత వారు పునఃపరిశీలించి అవినీతి సొమ్ము మొత్తాన్ని అమాంతం తగ్గించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిజామబాద్ డివిజన్‌లోని డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి మండలాల్లో ఉపాధి అక్రమాలపై సహ చట్టం ద్వారా వివరాలు అడిగినా అధికారులు ఇవ్వడం లేదు. జక్రాన్‌పల్లి మండలంలో లేబర్ పేమెంట్స్‌లో పనికి రాని వారికి, గ్రామంలో లేనివారికి సొమ్ము జమచేస్తూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఇలా ప్రతి ఏడాది రూ.లక్షల్లో అవినీతి జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆర్థిక గుర్తించిన అవినీతి రికవరీ జరిమానా పడిన జరిమానా/రికవరీ
సంవత్సరం (రూ.లలో) (రూ.లలో) అధికారులు (రూ.లలో)
2020–21 4558373.00 351079.00 63 406078.00
2021–22 14635271.00 378604.00 108 436632.00
2022–23 21143839.00 461534.00 240 1121527.00
2023–24 14617319.00 54785.00 41 189188.00
2024–25 10753602.00 218448.00 19 1207805.00
మొత్తం 65708404.00 1464450.00 471 3361230.00
అక్రమార్కులకే ‘ఉపాధి’
ఐదేళ్లలో జిల్లాలో
రూ.6.57 కోట్ల అవినీతి
సామాజిక తనిఖీల్లో
వెలుగు చూస్తున్న అక్రమాలు
రికవరీ చేయడంలో
అధికారుల నిర్లక్ష్యం